ఇంద్రకీలాద్రిపై నూతన భవనాలు.. ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్
రేపు ప్రారంభం కానున్న నూతన ‘లడ్డూ పోటు’, అత్యాధునిక ‘అన్నప్రసాద భవనం’... క్షేత్రస్థాయిలో తుది పనులను పరిశీలించిన కమిషనర్ కె. రామచంద్ర మోహన్... శ్రావణ శుక్రవారం భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశం...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన నూతన భవనాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. రేపు ప్రారంభం కానున్న నూతన ‘లడ్డూ పోటు’ (ప్రసాద తయారీ కేంద్రం), అత్యాధునిక వసతులతో నిర్మించిన ‘అన్నప్రసాద భవనం’ తుది పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆలయానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ నిర్మాణాల్లో జరుగుతున్న తుది పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. లడ్డూ ప్రసాదాల తయారీకి ఏర్పాటు చేసిన నూతన పోటులోని సౌకర్యాలు, అన్నప్రసాద భవనంలో భక్తులకు కల్పించనున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.

నూతన భవనాలను శాస్త్రోక్తంగా ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున దర్శనం, ప్రసాదాల పంపిణీ, అన్నప్రసాదం తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ పరిశీలనలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, స్థానాచార్య వి. శివప్రసాద్ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమతో పాటు దేవస్థాన ఇంజినీర్లు, ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

