ట్రాఫిక్ నియంత్రణలో బెజవాడ పోలీసుల సత్తా
గతేడాదితో పోలిస్తే విజయవాడలో 62 శాతానికి పైగా తగ్గిన ట్రాఫిక్ రద్దీ... 1,311 కిలోమీటర్ల నుంచి 497 కిలోమీటర్లకు తగ్గిన సంచిత రద్దీ... సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాఫిక్ నియంత్రణలో విజయవాడ పోలీసుల సత్ఫలితాలు...

విజయవాడ, అక్టోబర్ 22: దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు గణనీయమైన పురోగతి సాధించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ముందస్తు ప్రణాళికలు, నిరంతర పర్యవేక్షణతో గతేడాదితో పోలిస్తే ట్రాఫిక్ రద్దీ 62 శాతానికి పైగా తగ్గినట్లు పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం పర్యవేక్షణలో చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. భారీగా తగ్గిన ట్రాఫిక్ రద్దీ పోలీసుల గణాంకాల ప్రకారం 2025 దసరా ఉత్సవాల సమయంలో నమోదైన సంచిత ట్రాఫిక్ రద్దీ 1,311 కిలోమీటర్లు కాగా, 2026లో అది 497 కిలోమీటర్లకు తగ్గింది. రోజువారీ సగటు రద్దీ 119 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లకు పడిపోయింది. అదేవిధంగా గతేడాది 221 తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ హెచ్చరికలు నమోదవగా, ఈ ఏడాది వాటి సంఖ్య 38కి తగ్గింది. అంటే తీవ్రమైన రద్దీ హెచ్చరికల్లో సుమారు 83 శాతం తగ్గుదల నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ ఆస్ట్రామ్ ద్వారా నగరంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. రియల్‌టైమ్ హెచ్చరికల ఆధారంగా రద్దీ ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. భారీ కార్యక్రమాల మధ్య సమర్థ నిర్వహణ దసరా ఉత్సవాలతో పాటు జాతీయ సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్ 2.0, మెగా కార్నివాల్ వంటి భారీ కార్యక్రమాలు ఒకేసారి నిర్వహించినప్పటికీ ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సరస్ మేళా ప్రాంగణం, ఏలూరు రోడ్డు, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ప్రవేశమార్గం, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహించారు. సిబ్బందికి పోలీస్ ఉన్నతాధికారుల అభినందనలు దసరా ఉత్సవాల సందర్భంగా రాత్రింబవళ్లు శ్రమించిన ట్రాఫిక్ అధికారులు, సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయం, ముందస్తు ప్రణాళికలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా ట్రాఫిక్ నిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించగలిగామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించిన భక్తులకు, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

