తుపాను హెచ్చరికలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తం!
మూడు రోజులపాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక… చెరువుల నీటిమట్టాలు, గట్ల పటిష్టతపై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశం… ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచన…

ఏలూరు, నవంబర్ 2: తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు ఏలూరు జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా మైనర్ ఇరిగేషన్ చెరువుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నీటిపారుదల శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి చెరువుల నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుత నీటిమట్టాలు, గట్ల పటిష్టతను పరిశీలించి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించారు. ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని, అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని మండల అధికారులకు స్పష్టం చేశారు. ముఖ్యంగా తీరప్రాంత మండలాల్లోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

