అంగులూరులో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 60 కుటుంబాలు!
మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేరుగుమాల బాలు ఆధ్వర్యంలో చేరికలు… ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్న బీసీ కుటుంబాలు… టీడీపీ అంటే బీసీల పార్టీ.. కూటమిగా కలిసికట్టుగా ముందుకు సాగుతామన్న రాము…

గుడ్లవల్లేరు, నవంబర్ 2: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగులూరు గ్రామంలో వైసీపీకి చెందిన 60 బీసీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేరుగుమాల బాలు నేతృత్వంలో సోమవారం జరిగిన ఈ చేరికల కార్యక్రమం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కొత్తగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ టీడీపీ విధానాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వారిని అభినందించారు. గ్రామస్థాయి నుంచే ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. టీడీపీ బీసీలకు అండగా నిలిచే పార్టీ అని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి నాయకులంతా ఒకే కుటుంబంలా పనిచేస్తున్నారని అన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ గుడ్లవల్లేరు మండలంలో జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వర్రె బలరామకృష్ణతో పాటు కూటమి ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మేరుగుమాల బాలు మాట్లాడుతూ ఎమ్మెల్యే రాము అభివృద్ధి దృక్పథం నచ్చడంతోనే టీడీపీలో చేరినట్లు వెల్లడించారు. రైతులకు కష్టకాలంలో ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని, చంద్రబాబు నాయకత్వంలో గ్రామాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. బాలు నేతృత్వంలో మేరుగుమాల ఈశ్వరరావు, పంది సత్యనారాయణ, మేరుగుమాల కళ్యాణి, మేరుగుమాల చిన్ని, మేరుగుమాల మోహన్‌రావు తదితరులు టీడీపీలో చేరారు.
