కత్తితో దాడి.. కాల్పులతో కట్టడి!
ఇద్దరు సీఐల హెచ్చరిక కాల్పుల తర్వాతా వెనక్కి తగ్గని నిందితుడు... ఆత్మరక్షణలో మోకాలి దిగువ కాల్పులు.. నిందితుడు అదుపులోకి... పోలీసులపై దాడులను ఉపేక్షించేది లేదని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిక...

V10TV ప్రతినిధి, మచిలీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీసుపై కత్తితో దాడి చేసి పరారైన కేసులో ప్రధాన నిందితుడిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసే సమయంలోనూ నిందితుడు పోలీసులపై కత్తితో దాడికి దిగడంతో ఆత్మరక్షణలో పోలీసులు కాల్పులు జరిపినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తెలిపారు.
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్టు 31న దేవరపల్లి పరిధిలోని యర్నగూడెం సమీపంలో హైవే పెట్రోలింగ్ పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిలోని వ్యక్తులు పదునైన కత్తితో ఏఆర్ కానిస్టేబుల్ వి. వెంకటేశ్వరరావుపై దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌కు వైద్యం కొనసాగుతోంది.
దర్యాప్తులో ప్రధాన నిందితుడిని పెనమలూరుకు చెందిన అక్కిదాసరి అవినద్గా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక సమాచారంతో నిందితుడు ఉంగుటూరు–కంకిపాడు పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.
సెప్టెంబర్ 1 తెల్లవారుజామున కంకిపాడు పరిధిలోని మాణికొండ గ్రామ శివారులో నంబర్‌ప్లేట్ లేని డ్యూక్ బైక్‌పై వచ్చిన నిందితుడు పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు ఎస్పీ వివరించారు. అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో కత్తి, రాళ్లతో పోలీసులపై దాడికి దిగాడని, గన్నవరం పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు కానిస్టేబుల్ దేవిశెట్టి శ్రీనును కత్తితో గాయపరిచాడని తెలిపారు.
గన్నవరం, కంకిపాడు సీఐలు పలుమార్లు హెచ్చరించినా నిందితుడు వెనక్కి తగ్గలేదని ఎస్పీ పేర్కొన్నారు. ఇద్దరు సీఐలు చెరో రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపి హెచ్చరించినప్పటికీ కత్తితో దాడికి ప్రయత్నించడంతో, పోలీసుల ప్రాణరక్షణ కోసం కంకిపాడు సీఐ ఒక రౌండ్ నిందితుడి మోకాలి దిగువ భాగంలో కాల్పులు జరిపినట్లు తెలిపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని వైద్య చికిత్స కోసం తరలించారు.
ఈ ఘటనపై కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఎస్పీ వెల్లడించారు. కేసు దర్యాప్తు పర్యవేక్షణకు గుడివాడ ఎస్డీపీఓను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమించినట్లు చెప్పారు.
గంజాయి అక్రమ రవాణా, వినియోగంతో పాటు పోలీసుల ప్రాణాలకు ముప్పు కలిగించే దాడులకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు.

