పండుగ వేళ.. ప్రశాంతతే ప్రధాన మంత్రం!
మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి: డీఎస్పీ నాగేంద్రచారి... మతపెద్దలతో శాంతి సమావేశం.. ప్రజల్లో సోదరభావం పెంపొందించాలని సూచన... శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా...

సిరిసిల్ల, ఆగస్టు 25: పండుగ ఏ మతానికి చెందినదైనా ప్రజల మధ్య సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించేలా జరుపుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు. మిలాద్ ఉల్ నబీ పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు.
సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని మతపెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ పండుగలను మతసామరస్యంతో జరుపుకునేలా మతపెద్దలు చొరవ తీసుకోవాలని కోరారు. అన్ని వర్గాల మధ్య సమన్వయం పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.
మతసామరస్యం, సోదరభావం సమాజంలో మంచి సంబంధాలకు పునాది వేస్తాయని పేర్కొన్నారు. మిలాద్ ఉల్ నబీ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
పండుగ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించడం, ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ గణేష్తో పాటు మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, రఫి, మాజీ అధ్యక్షుడు శేఖ్ యూసుఫ్, మహమ్మద్ సత్తార్, ఖైరాత్ రఫియేద్దీన్, అంజద్, సిరాజ్, జహీర్, చాంద్, సాజిద్ తదితర మతపెద్దలు పాల్గొన్నారు.

