వైద్యం ముసుగులో మోసం.. 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్
హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్... జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో ఏకకాలంలో దాడులు... ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు?.. ఎలాంటి వైద్యం అందిస్తున్నారు?.. ఆరా తీస్తున్న పోలీసులు...

హైదరాబాద్, ఆగస్టు 25: వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతున్న వారిపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో నిర్వహించిన దాడుల్లో 11 మంది నకిలీ డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ వైద్యులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వైద్యం చేస్తున్న వారి విద్యార్హతలు, వైద్య పట్టాలు, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో సరైన అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్నట్లు అనుమానిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వీరు హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు? ఎంతకాలంగా వైద్యం చేస్తున్నారు? రోగులకు ఎలాంటి చికిత్సలు, మందులు అందిస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
వీరి వద్ద చికిత్స పొందిన వారి వివరాలతో పాటు నకిలీ వైద్య కార్యకలాపాల వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

