అమెజాన్ ఆర్డర్ల పేరిట రైల్వే అధికారికి టోకరా!
రైల్వే అధికారి కార్డు నుంచి తెలియకుండానే సైబర్ లావాదేవీలు... అమెజాన్‌లో ఎనిమిది మొబైళ్ల కొనుగోలు.. నాలుగు ఆర్డర్లు రద్దు... మరో నాలుగు ఫోన్లు బిహార్‌లోని పాట్నా చిరునామాకు డెలివరీ.. పటమట పోలీసుల దర్యాప్తు...

విజయవాడ, ఆగస్టు 25: సైబర్ నేరగాళ్లు మరోసారి క్రెడిట్ కార్డును లక్ష్యంగా చేసుకున్నారు. విజయవాడ పటమట ప్రాంతంలో నివసిస్తున్న ఓ రైల్వే అధికారి క్రెడిట్ కార్డు వివరాలను దుర్వినియోగం చేసి, ఆయనకు తెలియకుండానే రూ.2.19 లక్షలు ఖర్చు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైల్వే అధికారికి చెందిన క్రెడిట్ కార్డు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు అమెజాన్‌లో ఖరీదైన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. తనకు తెలియకుండా భారీ మొత్తంలో లావాదేవీలు జరిగిన విషయాన్ని గుర్తించిన బాధితుడు వెంటనే అప్రమత్తమై సంబంధిత బ్యాంకును సంప్రదించి క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించారు.
సైబర్ నేరగాళ్లు సదరు కార్డును ఉపయోగించి మొత్తం ఎనిమిది మొబైల్ ఫోన్లను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. విషయం సకాలంలో గుర్తించడంతో నాలుగు మొబైళ్ల ఆర్డర్లను రద్దు చేయించగలిగారు. అయితే అప్పటికే మరో నాలుగు మొబైల్ ఫోన్లు బిహార్‌లోని పాట్నా చిరునామాకు డెలివరీ అయినట్లు గుర్తించినట్లు సమాచారం.
క్రెడిట్ కార్డు వివరాలు నిందితులకు ఎలా చేరాయి? ఎలాంటి విధానంలో లావాదేవీలు జరిపారు? మొబైళ్లు డెలివరీ అయిన చిరునామా ఎవరిది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. బాధిత రైల్వే అధికారి ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసు నమోదు చేసి సైబర్ లావాదేవీల ఆధారంగా నిందితుల జాడ కనుగొనేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

