అర్ధరాత్రి తీరాన్ని తాకనున్న ‘మురసు’.. ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర తుపాను ముప్పు!
గంటకు 22 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తీవ్ర తుపాను… నెల్లూరు–నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం… ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థల నిరంతర పర్యవేక్షణ…

విజయవాడ, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు మురసు తీవ్ర తుపాను ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు–నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆర్టీజీఎస్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం మురసు తీవ్ర తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 22 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం నెల్లూరుకు 160 కిలోమీటర్లు, చెన్నైకి 180 కిలోమీటర్లు, కావలికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా ఒంగోలుకు 210 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తుపాను కదలికలను ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. తుపాను కదలికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజా హెచ్చరికలు జారీ చేయనున్నట్లు తెలిపింది.

