ఆటోల వెనుక కవర్లపై ట్రాఫిక్ పోలీసుల కొరడా!
రెండు రోజుల్లో 1,500 ఆటోల వెనుక కవర్ల తొలగింపు… ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు.. తీవ్ర ఉల్లంఘనలకు వాహనాల సీజ్…

విజయవాడ, నవంబర్ 11 : రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఆటోలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆటోల వెనుక భాగంలో ఏర్పాటు చేస్తున్న మూసివేసిన కవర్లను తొలగించేందుకు నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షిరిన్ బేగం నేతృత్వంలో ఏసీపీల పర్యవేక్షణలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ తనిఖీల్లో సుమారు 1,500 ఆటోల వెనుక కవర్లను తొలగించినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. వెనుక కవర్లతో ప్రమాదాలకు ఆస్కారం ఆటోల వెనుక భాగాన్ని పూర్తిగా మూసివేయడం వల్ల డ్రైవర్లకు వెనుక నుంచి వచ్చే వాహనాల కదలికలు స్పష్టంగా కనిపించవని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఓవర్టేక్ చేసే సమయంలో, మలుపులు తిరిగేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆటోల్లో ప్రయాణించే మహిళలు, చిన్నారులు బయటివారికి కనిపించకుండా ఉండటం వల్ల వారి భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రక్షణకు ప్రాధాన్యమిస్తూ వెనుక కవర్లను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరికలు ఆటోల వెనుక భాగంలో పూర్తిగా మూసివేసే కవర్లు ఏర్పాటు చేయరాదని, అనుమతించిన సంఖ్యకు మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని పోలీసులు సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ప్రతి ఆటో డ్రైవర్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. పాఠశాల విద్యార్థులను తరలించే ఆటో డ్రైవర్లు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆటో నంబర్‌తో పాటు 112 తప్పనిసరి ప్రయాణికుల భద్రత దృష్ట్యా డ్రైవర్ సీటు వెనుక ఆటో రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు అత్యవసర సహాయ నంబర్ 112ను స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం చలాన్లు విధిస్తామని, తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఈ ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఆటో డ్రైవర్లు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

