హస్తకళాకారుల కళ్లలో వెలుగు నింపిన పవన్ కళ్యాణ్
'క్రోచెట్ లేస్' కళాకారుల ఆరోగ్య సమస్యలపై వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి. 141 మంది కళాకారులకు ఉచిత కళ్లజోళ్లు అందజేత.. మరో 350 మందికి ఏర్పాట్లు. క్లస్టర్‌ల వారీగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు.

అమరావతి, ఆగస్టు 6: హస్తకళాకారుల సంక్షేమానికి మరోసారి అండగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, 'క్రోచెట్ లేస్' కళాకారుల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. హస్తకళా మహోత్సవం సందర్భంగా కళాకారులతో నేరుగా మాట్లాడి, దృష్టి లోపాలతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వెంటనే ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన పవన్ కళ్యాణ్, తొలి దశలో దృష్టి లోపాలతో బాధపడుతున్న 141 మంది కళాకారులకు కళ్లజోళ్లు అందజేశారు. అలాగే యలమంచిలి, అత్తిలి ప్రాంతాల్లో మరో 350 మంది కళాకారులకు కూడా ఉచిత కళ్లజోళ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హస్తకళాకారుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్‌ల వారీగా ఉచిత వైద్య శిబిరాలు నిరంతరం నిర్వహించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కళాకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

