మురసు ముప్పు ఇంకా తొలగలేదు!
రేపు ఉదయం వరకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి... భారీ వర్షాలతో పెరుగుతున్న వరద ప్రవాహాలు... రేపు సాయంత్రంలోగా బాధితులందరికీ సాయం అందాలి...

గడిచిన 24 గంటల్లో బాపట్ల, నాగులుప్పలపాడులో 20 సెంటీమీటర్ల చొప్పున, కొత్తపట్నంలో 18, త్రోవగుంట, చీరాలలో 17, నర్సాపురంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీఎం వెల్లడించారు. మంగళవారం ఉదయం నుంచి పల్నాడు జిల్లా యడ్లపాడులో 25 సెంటీమీటర్లు, మద్దిపాడులో 24, చిలకలూరిపేట, నాదెండ్లలో 22, గన్నవరం, చిగురుమామిళ్లలో 21 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వివరించారు. పల్నాడులోని కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్‌బరస్ట్ తరహాలో వర్షాలు కురిసినట్లు జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. దిగువ ప్రాంతాలకు వరద ముప్పు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహాలు దిగువన ఉన్న బాపట్ల జిల్లాకు చేరే అవకాశం ఉందని సీఎం హెచ్చరించారు. పర్చూరు వాగు నుంచి వరద నీరు సముద్రం వైపు ప్రవహిస్తున్నట్లు బాపట్ల కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. కోనసీమ నుంచి నెల్లూరు వరకు వివిధ జిల్లాల్లో వర్షాలు, ముంపు పరిస్థితులపై సమీక్షించారు. బాధితులకు సాయం అందించాలి తుఫాను బాధితులకు బుధవారం సాయంత్రంలోగా అందాల్సిన సహాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ముంపు ప్రాంతాల పరిస్థితులు, వరద ప్రవాహాలు, సహాయక చర్యల వివరాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గత వారం రోజులుగా అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో నిరంతరం విధులు నిర్వహిస్తున్న అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతో సహాయక చర్యలను మరింత సమర్థంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.

