ఐ అండ్ పీఆర్ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా బి. శ్రీనివాసరావు
విశ్వనాథన్ స్థానంలో అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం... సూర్యతేజకు బాధ్యతలిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను మార్చుతూ మరో జీవో... సమర్థ అధికారిగా గుర్తింపు పొందిన శ్రీనివాసరావుకు కీలక బాధ్యతలు...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌గా ఉన్న కె.ఎస్. విశ్వనాథన్ ఐఏఎస్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహిస్తున్న 11వ అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీలో పాల్గొనేందుకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
తొలుత విశ్వనాథన్ నిర్వహిస్తున్న బాధ్యతలను 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి మల్లవరపు సూర్యతేజకు పూర్తి అదనపు బాధ్యతలుగా అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా ఆ ఉత్తర్వుల్లో మార్పు చేస్తూ మరో జీవో విడుదల చేసి, 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బి. శ్రీనివాసరావుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది.
సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు పరిపాలనలో సమర్థ అధికారిగా గుర్తింపు పొందారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేసుకుంటూ శాఖ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి.
తన వద్దకు సమస్యలతో వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ, పరిష్కారానికి తన పరిధిలో సాధ్యమైన సహాయం అందించేందుకు శ్రీనివాసరావు ప్రయత్నిస్తారని సమగ్ర శిక్ష ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సమాచార, పౌరసంబంధాల శాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించడంతో మరో కీలక బాధ్యతను నిర్వర్తించనున్నారు.

