రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న జనరల్ స్టోర్..!
కెమెరాకు చిక్కిన బియ్యం కొనుగోలు దృశ్యాలు... డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటున్న దృశ్యాలు సైతం రికార్డు... నిల్వలు, బిల్లులు పరిశీలించి నిజానిజాలు తేల్చాలని అధికారులకు డిమాండ్...

నరసరావుపేట, ఆగస్టు 18: పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తోందా..? నరసరావుపేట మార్కెట్ సెంటర్‌లోని న్యూ గౌరీ శంకర్ జనరల్ స్టోర్ వద్ద చోటుచేసుకున్న వ్యవహారం ఈ అనుమానాలకు తావిస్తోంది. సదరు దుకాణం వద్ద రేషన్ బియ్యంగా పేర్కొంటున్న బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీలు నిర్వహించి వాస్తవాలు తేల్చాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
విలేకరి స్వయంగా సేకరించిన వీడియో, ఫొటోల్లో బియ్యం తీసుకువచ్చిన వ్యక్తులతో దుకాణం వద్ద లావాదేవీలు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. బియ్యం ఉన్న దృశ్యాలతో పాటు నగదు ఇవ్వడం, తీసుకోవడం కూడా వీడియోలో రికార్డయినట్లు సమాచారం. అయితే వీడియోలో కనిపిస్తున్న బియ్యం ప్రభుత్వ రేషన్ బియ్యమేనా? నగదు లావాదేవీ బియ్యం కొనుగోలుకే సంబంధించినదా? అనే అంశాలను సంబంధిత అధికారులు నిర్ధారించాల్సి ఉంది.
ఈ వ్యవహారంపై దుకాణ యజమాని చొక్కా కోటేశ్వరరావును వివరణ కోరగా, “నీకు ఏం పని?” అంటూ సమాధానం ఇచ్చినట్లు విలేకరి పేర్కొన్నారు.
ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యమే ప్రైవేట్ దుకాణంలో కొనుగోలు చేస్తున్నట్లు తేలితే ఆ బియ్యం ఎవరి నుంచి వస్తోంది? ఎంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది? కొనుగోలు చేసిన బియ్యాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
సివిల్ సప్లైస్ అధికారులు దుకాణాన్ని తనిఖీ చేసి అక్కడ ఉన్న బియ్యం నిల్వల స్వభావాన్ని నిర్ధారించడంతో పాటు స్టాక్ రికార్డులు, కొనుగోలు బిల్లులు, విక్రయ వివరాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరాకు చిక్కిన దృశ్యాలను కూడా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

