దీపావళి పేరిట రూ.వెయ్యి ఎర.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!
పేటీఎం కానుక అంటూ వాట్సాప్లో నకిలీ సందేశాలు… రూ.1,000 ఉచితంగా వస్తాయంటూ సైబర్ మోసగాళ్ల వల… అనుమానాస్పద లింకులను నమ్మొద్దని సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరిక…

హైదరాబాద్, నవంబర్ 7 : దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. పేటీఎం దీపావళి కానుక పేరుతో రూ.1,000 ఉచితంగా అందిస్తున్నట్లు వాట్సాప్లో ప్రచారమవుతున్న సందేశాలను నమ్మవద్దని సూచించారు. పేటీఎం నుంచి రూ.1,000 వచ్చాయని, ఇతరులు కూడా ప్రయత్నించాలంటూ ఆకర్షణీయమైన సందేశాలను సైబర్ మోసగాళ్లు పంపిస్తున్నారని తెలిపారు. ఇటువంటి సందేశాల్లోని లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తాను మొదట నకిలీ అనుకున్నానని, కానీ నిజంగానే రూ.1,000 వచ్చాయని పేర్కొంటూ ఇతరులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. పండుగ కానుకల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను తెరవవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు,రహస్య సంకేతాలు ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.

