రెడ్‌క్రాస్ సేవలకు స్వర్ణ గౌరవం
రెడ్‌క్రాస్ సేవల్లో విశేష కృషికి గుర్తింపు... గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పతకం... రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు కలెక్టర్లకు గోల్డ్ మెడల్స్...

విజయవాడ, సెప్టెంబర్ 2: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలకు అందించిన విశేష సహకారానికి గుర్తింపుగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గవర్నర్ గోల్డ్ మెడల్ అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ 2024–25 వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర గవర్నర్, ఐఆర్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా బాలాజీ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
రెడ్‌క్రాస్ ద్వారా మానవతా సేవలను విస్తరించడం, వనరుల సమీకరణ, సీఎస్ఆర్ ప్రాజెక్టులకు సహకారం, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చూపిన కృషిని గుర్తిస్తూ ఈ అవార్డులు అందజేశారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీతో పాటు రాష్ట్రంలోని మరో ఆరుగురు జిల్లా కలెక్టర్లు కూడా గవర్నర్ గోల్డ్ మెడల్స్ అందుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ చేపడుతున్న మానవతా కార్యక్రమాలను అభినందించారు. యువతను రెడ్‌క్రాస్ సేవల్లో మరింత భాగస్వాములను చేయాలని, విద్యాసంస్థల్లో యూత్ రెడ్‌క్రాస్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

