సర్వమత సామరస్యానికి ప్రతీకగా పశ్చిమం
పంజా సెంటర్‌లో భక్తిశ్రద్ధలతో ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ బయాన్... మత పెద్దలు, ఉలేమాలను ఘనంగా సత్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి... ప్రవక్త బోధనలు శాంతి, దయ, సోదరభావానికి మార్గదర్శకం: వెలంపల్లి శ్రీనివాసరావు...

విజయవాడ, ఆగస్టు 26: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్‌లో ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ సందర్భంగా ఆధ్యాత్మిక ప్రసంగం (బయాన్) కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గుల్‌పోషి కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ఉలేమాలను వెలంపల్లి శ్రీనివాసరావు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి శాంతి, దయ, సమానత్వం, పరస్పర సోదరభావం వంటి గొప్ప విలువలను నేర్పుతుందని పేర్కొన్నారు. ప్రవక్త బోధనలు సమాజంలో ప్రేమ, ఐక్యతను పెంపొందించేందుకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎల్లప్పుడూ సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. మతాలకు అతీతంగా ఒకరి పండుగల్లో మరొకరు భాగస్వాములై ఐక్యంగా జరుపుకోవడం పశ్చిమ నియోజకవర్గ ప్రత్యేకత అని కొనియాడారు.
కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా, పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, సమృద్ధి నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

