ఓటరు జాబితాలో అర్హులకు చోటు తప్పనిసరి: కలెక్టర్ డీకే బాలాజి
ఓటర్ల జాబితా పరిశీలనలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశం... గోశాల గ్రామ సచివాలయంలో క్లెయిమ్లు, అభ్యంతరాలపై ప్రజా విచారణ... బహుళ నమోదులు, అనర్హుల పేర్లపై నిబంధనల మేరకు చర్యలు...

పెనమలూరు, ఆగస్టు 25: అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాపై నమోదైన క్లెయిమ్లు, అభ్యంతరాలకు సంబంధించి పెనమలూరు మండలం గోశాల గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా విచారణను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసిన వారితో కలెక్టర్ మాట్లాడి వారి వాదనలను తెలుసుకున్నారు. ఓటర్ల పేర్లు, చిరునామాలు తదితర వివరాలకు సంబంధించి సమర్పించిన దరఖాస్తులు, ఆధారాలను పరిశీలించారు.
ప్రతి దరఖాస్తును ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హుల పేర్లు, ఒకే వ్యక్తి పేరుతో ఉన్న బహుళ నమోదులను గుర్తించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
క్లెయిమ్లు, అభ్యంతరాలు తెలిపిన వారికి తమ వాదనను వినిపించే అవకాశం కల్పించాలని, వారు సమర్పించిన ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
కార్యక్రమంలో ఉయ్యూరు ఆర్డీవో ఎస్. కరుణ కుమారి, ఎన్నికల విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

