ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు మృతి
దొరకుంట శివారులో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం... మృతుల్లో ఐదుగురు మహిళలు.. ఒక పురుషుడు... 20 మందికి తీవ్ర గాయాలు.. కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
కోదాడ, ఆగస్టు 26: హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న కంటైనర్ లారీని బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం.
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్సుల్లో కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుల గుర్తింపు సహా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

