ఆమెకు 41.. అతనికి 20.. ప్రేమ వ్యవహారం హత్యకు దారి!
వివాహానికి అడ్డొస్తుందనే అనుమానంతో ప్రియురాలి హత్య... హైదరాబాద్‌లో కత్తి కొనుగోలు.. ఏపీలో దారుణం... కత్తితో పొడిచి చంపి.. మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం...

ఏలూరు, అక్టోబర్ 27: వివాహానికి అడ్డొస్తుందనే అనుమానంతో తనకంటే 21 ఏళ్లు పెద్దదైన మహిళను ఓ యువకుడు దారుణంగా హత్య చేసిన కేసును ఏలూరు జిల్లా చేబ్రోలు పోలీసులు ఛేదించారు. మహిళను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్య చేయడమే కాకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఉంగుటూరు మండలం రావులపర్రుకు చెందిన గండికోట అజయ్ కుమార్ (20)ను అరెస్టు చేశారు. మంగళవారం చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపర్రుకు చెందిన సంధ్యారాణి (41) తన భర్తతో కలిసి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ గండికోట అజయ్ కుమార్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల అజయ్‌కు అతడి మరదలితో వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో సంధ్యారాణితో సంబంధాన్ని కొనసాగించేందుకు అజయ్ నిరాకరించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సంధ్యారాణి బయటపెడుతుందనే అనుమానంతో ఆమెను హత్య చేయాలని అజయ్ నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లి కత్తి కొనుగోలు చేసి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అనంతరం తాడేపల్లిగూడెంలో కారును అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 23న సంధ్యారాణిని కారులో ఎక్కించుకుని నాచుగుంట రెవెన్యూ పరిధిలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె మెడపై కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. అదే రోజు సంధ్యారాణి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉన్నట్లు ఫారెస్ట్ బీట్ అధికారి రాజేశ్ సమాచారం అందించడంతో చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణలో మృతురాలు అదృశ్యమైన సంధ్యారాణిగా గుర్తించారు. నిడమర్రు సీఐ రజనీ కుమార్ పర్యవేక్షణలో చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్, గణపవరం ఎస్సై మణికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు.

