మూడు డివిజన్లలో కూటమి ప్రచార హోరు!
77, 79, 80వ డివిజన్లలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి... నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే బొండా ఉమా...

విజయవాడ, అక్టోబర్ 27: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మంగళవారం సాయంత్రం 77, 79, 80వ డివిజన్లలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నిర్వహించిన ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 77వ డివిజన్ సింగ్‌నగర్ డాబా కొట్లు సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రచారం లూనా సెంటర్, చల్లగాలి ఐజయ్య రోడ్డు, 19బీ రోడ్డు మీదుగా కొనసాగింది. అనంతరం 79వ డివిజన్లోని లెనిన్ సెంటర్, మసీదు రోడ్డు, ఎంకే బేగ్ స్కూల్ వెనుక రోడ్డు, యార్డ్ రోడ్డు మీదుగా పర్యటించారు. అక్కడి నుంచి 80వ డివిజన్ సీ బ్లాక్‌లో ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడమే తమ లక్ష్యమన్నారు. ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని సూచించారు. నగరంలోని ప్రతి డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బొండా ఉమా పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమని, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. విజయవాడ నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన కొనసాగేందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని బొండా ఉమామహేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల సమష్టి కృషితో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ఆయా డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

