74వ డివిజన్‌లో కూటమి ప్రచార జోరు!
తోటవారి వీధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం... రూ.700 కోట్లతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు: బొండా సిద్ధార్థ... గోపి సాయి కుమార్‌కు ప్రజలు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి...

పాయకాపురం, అక్టోబర్ 27: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలోని 74వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. మంగళవారం సాయంత్రం తోటవారి వీధిలో టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ విస్తృతంగా పర్యటించారు. కూటమి బలపరిచిన టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గోపి సాయి కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. వృద్ధులకు పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం, పేద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలు ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 27 నెలల్లో సుమారు రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు సిద్ధార్థ తెలిపారు. రహదారులు, మౌలిక సదుపాయాలు, ప్రజా అవసరాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేలాది మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కీలక ముందడుగని అభివర్ణించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు 74వ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి కట్టుబడి ఉందన్నారు. డివిజన్ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా స్థానిక సమస్యల పరిష్కారానికి మరింత అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. 74వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గోపి సాయి కుమార్‌కు సైకిల్ గుర్తుపై, కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బొండా సిద్ధార్థ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎరుబోతు శ్రావణి రామారావు, గుండపు చలపతిరావు, అమర్నాథ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

