జర్నలిస్టుల హక్కులే లక్ష్యం.. సంక్షేమమే ఏపీజేఎఫ్ ధ్యేయం
జర్నలిస్టుల సంక్షేమమే ఏపీజేఎఫ్ ప్రధాన లక్ష్యం... ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ప్రత్యేక సంక్షేమ నిధికి డిమాండ్... 60 ఏళ్లు నిండిన లేదా 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి...

విశాఖపట్నం, ఆగస్టు 12: రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్లు, గుర్తింపు లభించేలా కృషి చేయడమే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ప్రధాన లక్ష్యమని సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ చెవుల కృష్ణాంజనేయులు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఏపీజేఎఫ్ నిరంతరం కృషి చేస్తోందన్నారు.
విశాఖపట్నంలోని ఓ హోటల్లో బుధవారం ఏపీజేఎఫ్ మహాసభ సన్నాహక కార్యక్రమాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
60 ఏళ్లు నిండిన లేదా 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సాంకేతిక కారణాలతో అక్రిడిటేషన్ కార్డులు పొందలేకపోయిన అర్హులైన జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా మీడియా సంస్థలు జారీ చేసే గుర్తింపు పత్రాల ఆధారంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రతి ఏడాది వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. జర్నలిస్టుల రైల్వే పాస్ సమస్యపై త్వరలో కేంద్ర మంత్రిని కలిసి పరిష్కారానికి కృషి చేస్తామని కృష్ణాంజనేయులు తెలిపారు. యూట్యూబ్ ఛానళ్ల గుర్తింపునకు స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శివ రాజేష్ మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసమే సంఘం పనిచేస్తోందన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నిస్తామని చెప్పారు.
ఏపీజేఎఫ్ మహాసభ నిర్వహణ కోసం అడహాక్ కమిటీ కన్వీనర్లుగా సీనియర్ జర్నలిస్టులు బి. రవికాంత్, పి.ఏ. రావు, వై. నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, యూసఫ్‌లను ప్రకటించారు. విశాఖ ఉమ్మడి జిల్లా మహాసభ సందర్భంగా కొత్త జిల్లాల కమిటీలను ప్రకటిస్తామని శివ రాజేష్ తెలిపారు. మహాసభను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులందరూ సహకరించాలని సీనియర్ జర్నలిస్టు బి. రవికాంత్ కోరారు.

