పేదోడు మరింత పేదగా.. పెద్దోడు మరింత పెద్దగా!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు అధోగతి: సీపీఐ... విజయవాడ సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్... పేదలకు ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్యం కల్పించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 12: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పేదవాడు మరింత పేదవాడిగా, ధనవంతుడు మరింత ధనవంతుడిగా మారుతున్నాడని సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు విమర్శించారు. పాలకుల విధానాల కారణంగా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని ఆరోపించారు.
సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు నగర సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార పాదయాత్ర ఏడో రోజు బుధవారం క్రీస్తురాజపురంలోని చంద్ర రాజేశ్వరరావు గ్రంథాలయం నుంచి మొగల్రాజపురం సిద్ధార్థ కళాశాల వరకు సాగింది. నగర కార్యవర్గ సభ్యుడు కొడాలి ఆనందరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, కార్మికులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

విజయవాడ నగర సమగ్రాభివృద్ధికి రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. నగరంలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు ఇళ్లు లేని పేదలకు రెండు సెంట్ల నివాస స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఇళ్లకు పట్టాలు, రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమైతే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
పాదయాత్రలో సీపీఐ నగర నాయకులు, ఏఐటీయూసీ, మహిళా సమాఖ్య, ప్రజానాట్యమండలి, ఏఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

