ఎద్దు కోసం ప్రాణాలకు తెగించి.. చివరకు మృత్యుఒడిలోకి
కసాపురం పొలంలో విద్యుత్ ఘాతంతో బోయ ఆంజనేయులు దుర్మరణం... ఎద్దును కాపాడేందుకు వెళ్లి విద్యుత్ షాక్కు గురైన రైతు... విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తుల ఆగ్రహం...

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో విద్యుత్ ఘాతంతో రైతు బోయ ఆంజనేయులు మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఉదయం పొలంలో కంది సేద్యం చేసేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగ ఆంజనేయులుకు చెందిన ఎద్దుపై పడింది. ఎద్దును కాపాడేందుకు ప్రయత్నించిన ఆంజనేయులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల వద్ద తెగిపడిన విద్యుత్ వైర్లను సకాలంలో సరిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

