స్టైఫండ్ పెంచాల్సిందే.. జూనియర్ డాక్టర్ల నిరసన
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శాంతియుత ఆందోళన... తెలంగాణ, కర్ణాటక తరహాలో స్టైఫండ్ పెంచాలని డిమాండ్... రోగులకు ఇబ్బంది లేకుండా అత్యవసర సహా వైద్య సేవలు కొనసాగింపు...

మచిలీపట్నం, ఆగస్టు 12 (వీ10టీవీ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసనలో భాగంగా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జూనియర్ డాక్టర్లు శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ఆవరణలో నిరసన నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
జూనియర్ డాక్టర్లకు ప్రస్తుతం అందిస్తున్న స్టైఫండ్‌ను తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో స్టైఫండ్ తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలకు సమానంగా ఏపీలోనూ స్టైఫండ్ పెంచాలని కోరారు.
నిరసన కారణంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు కొనసాగిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. అత్యవసర సేవలతో పాటు ఇతర వైద్య సేవలను యథావిధిగా అందిస్తున్నామని స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్టైఫండ్ పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.
నిరసనలో జూనియర్ డాక్టర్ల మచిలీపట్నం అధ్యక్షుడు డాక్టర్ కె. శివబ్రహ్మం, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్. అనిల్ కుమార్, డాక్టర్ ఎం. కోమల్ ఫణిర్మయి, కార్యదర్శి డాక్టర్ దివాకర్ రెడ్డి, ఉప కార్యదర్శి టి. రామకృష్ణ, ఎ. సంతోషిని తదితరులు పాల్గొన్నారు.

