సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులే పునాది
విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులకు ఘన సత్కారం ఏఐ ప్రత్యామ్నాయం కాదు.. సహాయక సాధనం మాత్రమే: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కంచనపల్లి నాగకుమారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

గుడివాడ, సెప్టెంబరు 6 (ఆంధ్రప్రభ): విద్యార్థులకు జ్ఞానంతోపాటు క్రమశిక్షణ, బాధ్యత, విలువలను నేర్పించే ఉపాధ్యాయుల సేవలే సమాజ నిర్మాణానికి పునాదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. కీ.శే. కంచనపల్లి నాగకుమారి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడ ఆఫీసర్స్ క్లబ్‌లో శనివారం రాత్రి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ కన్వీనర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత ప్రతి వ్యక్తి జీవితంపై అత్యధిక ప్రభావం చూపేది ఉపాధ్యాయులేనన్నారు. ఉపాధ్యాయులను గౌరవించడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా విద్యావ్యవస్థను, సమాజ భవిష్యత్తును గౌరవించడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో ప్రైవేటు పాఠశాలల నుంచి సైతం విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడం వెనుక ఉపాధ్యాయుల కృషి ఉందని కొనియాడారు. విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి, వారిని సరైన దిశలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఏఐతో ఉపాధ్యాయుల పాత్ర మరింత కీలకం విద్యారంగంలో కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్నప్పటికీ, అది ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాదని రాము స్పష్టం చేశారు. ఏఐ కేవలం సహాయక సాధనం మాత్రమేనని, దానిని విద్యార్థుల అభ్యాసానికి సమర్థంగా అనుసంధానించే బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వారిలో ఆత్మవిశ్వాసం, మానవీయ విలువలను పెంపొందించే ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయలేదన్నారు. ఉపాధ్యాయుల కృషిని ప్రభుత్వం గుర్తిస్తుంది ఉపాధ్యాయుల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన డీఎస్సీల ద్వారా అనేకమంది ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారని గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, ఉపాధ్యాయుల కృషిని ముఖ్యమంత్రి తప్పకుండా గుర్తించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. అనంతరం వివిధ విభాగాల్లో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు తదితరులు శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు గోపాలరావు, సీహెచ్ రజిని, బాలాజీ, శ్రీనివాస్, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, వంగివరపు నవీన్, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ట్రస్ట్ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

