ప్రాణభయం ఉందన్నా స్పందించలేదా..?
విజయవాడ మహిళా పోలీస్‌స్టేషన్ సిబ్బందిపై బాధితురాలి ఆరోపణలు ఫిర్యాదు స్వీకరించకుండా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పంపించారని ఆవేదన రక్షణ కల్పించి న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

విజయవాడ క్రైమ్, సెప్టెంబరు 6 (ఆంధ్రప్రభ): భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ రక్షణ కోరేందుకు విజయవాడ మహిళా పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన ఓ మహిళకు నిరాశ ఎదురైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తన సమస్యను పూర్తిగా వినకుండానే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించి పంపించివేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వేధింపులతో తాను తీవ్ర భయాందోళనకు గురవుతున్నానని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో రక్షణ కోసం మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు ఆమె తెలిపింది. తన ఫిర్యాదును స్వీకరించి ధైర్యం చెప్పాల్సిన సిబ్బంది, పరిధి అంశాన్ని ప్రస్తావిస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని సూచించినట్లు ఆరోపించింది. ‘మాకు రక్షణ కల్పించేది ఎవరు?’ మహిళల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్‌లోనే తగిన స్పందన లభించకపోతే బాధితులు ఎవరిని ఆశ్రయించాలని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రాణహాని ఉందని చెబుతున్న మహిళ ఫిర్యాదును పరిశీలించి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాల్సిందని కోరుతున్నారు. కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాం ఈ వ్యవహారాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధితురాలి ఫిర్యాదును పరిశీలించడంతోపాటు ఆమెకు తగిన భద్రత, న్యాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే బాధితురాలి ఆరోపణలపై మహిళా పోలీస్‌స్టేషన్ అధికారుల వివరణ తెలియాల్సి ఉంది. అధికారుల స్పందన అనంతరమే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

