పశ్చిమలో వైసీపీ జెండా ఎగరడమే లక్ష్యం
వెలంపల్లి ఆధ్వర్యంలో పార్టీ సంస్థాగత సమావేశం ఈ నెల 23 నుంచి ఇంటింటికీ ప్రచారం 28 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబరు 6 (ఆంధ్రప్రభ): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 28 డివిజన్లలో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భవానీపురంలో ఆదివారం విస్తృతస్థాయి సంస్థాగత సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, క్లస్టర్, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ‘వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ పోస్టర్‌ను ఆవిష్కరించి, పార్టీలో వివిధ పదవులు పొందిన నాయకులకు గుర్తింపు కార్డులు అందజేశారు. జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారు: అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని


పిలుపునిచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థతోపాటు జిల్లా పరిషత్‌లోనూ వైసీపీ జెండా ఎగరేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. 23 నుంచి ఇంటింటికీ ప్రచారం: వెలంపల్లి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు. మొత్తం 28 డివిజన్లలో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఈ నెల 23 నుంచి పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీల అమలు తీరును ప్రజలకు వివరిస్తాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన వైఎస్సార్ చేయూత, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పింఛన్ విధానం, ఆడబిడ్డ నిధి తదితర హామీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పుతో కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని వెలంపల్లి వ్యాఖ్యానించారు. సమావేశంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, మాజీ చైర్పర్సన్ బండి పుణ్యశీల, తోలేటి శ్రీకాంత్, మనోజ్ కొఠారి, గౌస్ మొహిద్దీన్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

