సముద్రంలో మునిగిన బోటు.. తొమ్మిది మందికి పునర్జన్మ
భైరవపాలెం మొగ సమీపంలో మత్స్యకారుల బోటుకు ప్రమాదం బలమైన గాలులకు అదుపుతప్పి సముద్రంలో మునిగిన పడవ మరో బోటు సిబ్బంది అప్రమత్తతతో తొమ్మిది మంది సురక్షితం

కోనసీమ, సెప్టెంబర్ 24: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు మునిగిపోయిన ఘటన కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది. మరో బోటు సిబ్బంది సకాలంలో స్పందించడంతో తొమ్మిది మంది మత్స్యకారులు సురక్షితంగా బయటపడి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీను బోటులో తొమ్మిది మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. తెల్లవారుజామున భైరవపాలెం మొగ సమీపంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో బోటు అదుపుతప్పి సముద్రంలో మునిగిపోయింది. దీంతో అందులోని మత్స్యకారులు ప్రాణభయంతో ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో సమీపంలో ఉన్న మరో బోటు సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మునిగిపోతున్న బోటులోని తొమ్మిది మందినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో మత్స్యకారుల కుటుంబాలు ఊపిరిపీల్చుకున్నాయి.

