జనన, మరణాల ఆలస్య నమోదుకు కొత్త నిబంధనలు!
ఏడాది నుంచి రెండేళ్లలోపు నమోదుకు అధికారుల నిర్ధారణ తప్పనిసరి… రెండేళ్లు దాటితే మేజిస్ట్రేట్ ఉత్తర్వులతోనే నమోదు… సెక్షన్-13 నిబంధనల సవరణపై ప్రభుత్వ ఆదేశాలు…

అమరావతి, నవంబర్ 9: జనన, మరణాల ఆలస్య నమోదుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జనన, మరణాల నమోదు చట్టంలోని సెక్షన్-13 నిబంధనలను సవరిస్తూ, ఆలస్యంగా అందే వివరాల నమోదుకు అధికారుల వాస్తవిక నిర్ధారణ తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ను ఉటంకిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సంబంధిత ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఆదేశాల ప్రకారం జననం లేదా మరణం జరిగిన ఏడాది నుంచి రెండేళ్లలోపు నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్, రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) లేదా తహసీల్దారు వాస్తవికతను పరిశీలించి జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించాల్సి ఉంటుంది. అలాగే జననం లేదా మరణం జరిగిన రెండేళ్ల తర్వాత నమోదు కోసం సమాచారం అందితే సంబంధిత ప్రాంతంపై అధికార పరిధి కలిగిన ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ వాస్తవికతను పరిశీలించి ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా నమోదు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో చట్టప్రకారం నియమితులైన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లకు తగిన అధికారాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. సవరించిన నిబంధనలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ వ్యవస్థతో పాటు కార్యనిర్వహణ విధానాల్లో మార్పులు చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)ను ఆదేశించారు. ఆలస్య నమోదులో వాస్తవికతను నిర్ధారించడం ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆదేశాల ఉద్దేశంగా తెలుస్తోంది.

