రెండు బైకుల ఢీ.. యువ ఇంజనీర్ బలి!
167బీ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం… అక్కడికక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు… ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే మృత్యువాత.. కుటుంబంలో తీరని విషాదం…

సీఎస్‌పురం, నవంబర్ 9 : ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలను బలిగొంది. సీఎస్‌పురం మండలం ఉప్పలపాడు స్టేజి సమీపంలోని మైదుకూరు–సింగరాయకొండ 167బీ జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కడప జిల్లా బి.కోడూరు మండలం హైత్రంపేట గ్రామానికి చెందిన కొండా వెంకటసుబ్బారెడ్డి (23)గా గుర్తించారు. ఇటీవలే సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిన ఆయన వివాహితుడు. జీవితంలో స్థిరపడుతున్న సమయంలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఈ ప్రమాదంలో వెంకటసుబ్బారెడ్డితో ఉన్న ఆయన మామ సిద్ధారెడ్డి కాలు విరిగినట్లు సమాచారం. మరో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సీఎస్‌పురానికి చెందిన డ్రైవర్ పాశం వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై పి. వెంకటేశ్వరరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తరలించారు. వెంకటేశ్వర్లును మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు, సిద్ధారెడ్డిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జాతీయ రహదారిపై భద్రతపై ప్రశ్నలు రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వాహనాల వేగం, రహదారి పరిస్థితులు, ప్రమాదం జరిగిన తీరు తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాతీయ రహదారిపై భద్రతా చర్యలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

