మూడు చోట్ల అగ్నిప్రమాదాలు.. అప్రమత్తమైన ప్రభుత్వం!
దీపావళి నిప్పురవ్వలతో రెండు దుకాణాల్లో మంటలు… రాజాంలో ఆటోమొబైల్ షోరూమ్‌కు భారీ ఆస్తినష్టం… ప్రమాదాలపై ఆరా తీసిన హోంమంత్రి అనిత…

అమరావతి, నవంబర్ 9: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆరా తీశారు. విజయనగరం జిల్లా రాజాం, కృష్ణా జిల్లా గన్నవరం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన మూడు అగ్నిప్రమాదాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా రాజాంలో దీపావళి బాణసంచా నిప్పురవ్వల కారణంగా ఓ ఆటోమొబైల్ షోరూమ్‌లో మంటలు చెలరేగి భారీ ఆస్తినష్టం సంభవించినట్లు అందిన సమాచారంపై మంత్రి ఆరా తీశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా గన్నవరంలో బాణసంచా నిప్పురవ్వల కారణంగా ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ దుకాణం అగ్నికి ఆహుతైన ఘటనపైనా అధికారులతో మాట్లాడారు. మూడు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల పరిస్థితులు, ఆస్తినష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీపావళి సందర్భంగా బాణసంచా వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులకు సూచించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

