హెరిటేజ్ కోసమే విజయ డెయిరీని దెబ్బతీసే ప్రయత్నం: ఎలిజబెత్ రాణి
కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ వ్యవహారాల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపణ పాడి రైతుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముందని ఆందోళన పాల ధర పెంపుతో సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుందని విమర్శ

గన్నవరం: రైతుల సహకారంతో ఆరు దశాబ్దాలకు పైగా అభివృద్ధి చెందిన విజయ డెయిరీని బలహీనపరిచి, హెరిటేజ్ సంస్థకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని గన్నవరం మండలం జెడ్పీటీసీ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణి ఆరోపించారు. విజయ డెయిరీని మూతపడే పరిస్థితికి తీసుకెళ్లే చర్యలను ప్రజలు గుర్తించి ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎలిజబెత్ రాణి మాట్లాడుతూ 1960లో ప్రారంభమైన విజయ డెయిరీ లక్షలాది మంది పాడి రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెంది రైతుల ఆస్తిగా నిలిచిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గంలో అధికార పార్టీ జోక్యం చేసుకుంటోందని, డైరెక్టర్లు, చైర్మన్‌ను తొలగించి తమకు అనుకూలమైన వారిని నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ పరిణామాల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు, రాజకీయ కక్ష సాధింపు కూడా మిల్క్ యూనియన్ వ్యవహారాలపై ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాత్రపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. విజయ డెయిరీ బలహీనపడితే భవిష్యత్తులో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. రైతుల సహకార వ్యవస్థను కాపాడాల్సిన ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. విజయ డెయిరీ పాల ధరను లీటరుకు రెండు రూపాయలు పెంచడంపైనా ఎలిజబెత్ రాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ధర పెంపును అనుసరించి ప్రైవేటు డెయిరీలు కూడా ధరలు పెంచితే సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని అన్నారు. పాలు పిల్లలు, సామాన్య కుటుంబాలకు అత్యవసరమైన నిత్యావసర వస్తువని, వాటిని ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే పరిస్థితులు సృష్టించరాదన్నారు. విజయ డెయిరీని బలహీనపరిచే చర్యలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, పాడి రైతుల ప్రయోజనాలు, సహకార వ్యవస్థ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎలిజబెత్ రాణి డిమాండ్ చేశారు.

