పేద కుటుంబాలకు అండగా నిలుస్తాం
30 మంది వితంతువులు, నిరుపేద మహిళలకు నిత్యావసరాల పంపిణీ… ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు సేవకు ముందుకు రావాలి… సెంట్రల్‌ను పేదరికం లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: బొండా ఉమా…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 5: ఆర్థికంగా వెనుకబడిన పేదలు, వితంతువులు, నిరుపేద మహిళలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. 26వ డివిజన్ చుట్టుగుంటలో ముస్లిం సమైక్య వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోమవారం వితంతువులు, పేద మహిళలకు నిత్యావసర సరకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమా సుమారు 30 మంది మహిళలకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులను అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ గౌస్ బాషా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘మన డివిజన్–మన బాధ్యత’ కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను గుర్తించి సహాయం కోరగానే వేదిక రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అహ్మద్

స్పందించడం సంతోషకరమన్నారు. పేదలు, బలహీనవర్గాలు, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అవసరమైన సమయంలో పేదలకు చేయూతనివ్వడం గొప్ప మానవతా సేవగా పేర్కొన్నారు. పీ–4 పథకం ద్వారా పేద కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని పేదరికం లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని బొండా ఉమా స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. సయ్యద్ అహ్మద్ మాట్లాడుతూ బొండా ఉమా సూచనతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో వల్లభనేని సతీష్, తోట పాండు, సయ్యద్ సర్తాజ్ అహ్మద్, ఇబ్రహీం, నసీమా సుల్తానా, అబ్దుల్లా, అయ్యాజ్, రంజానీ, అయేషా, అఫియా, నస్రీన్, నూర్జహాన్, నజ్మా తదితరులు పాల్గొన్నారు.

