ఆపదలో అభయం.. తల్లీకూతుళ్లకు ఆశ్రయం!
దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను ఆదుకున్న శక్తి టీమ్… ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ ఆదేశాలతో సురక్షిత ప్రాంతానికి తరలింపు… రక్షణతో పాటు పునరావాసానికి చర్యలు చేపట్టిన మహిళా పోలీసులు…

ఏలూరు, అక్టోబర్ 11: ఆపదలో ఉన్న తల్లీకూతుళ్లకు ఏలూరు మహిళా పోలీసుల శక్తి టీమ్ అండగా నిలిచింది. మానసిక సమస్యలతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను గుర్తించి వారికి సురక్షిత ఆశ్రయం కల్పించింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు, ఎస్‌ఐ నాగమణి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వారిని స్థానిక క్రిస్టియన్ ఛారిటీ సంస్థకు తరలించారు. అక్కడ వారికి అవసరమైన వసతులు అందేలా చర్యలు తీసుకున్నారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలోనూ శక్తి టీమ్ సేవలందిస్తోంది. అనాథ చిన్నారులకు ఆశ్రయం, విద్యా సదుపాయాలు కల్పించడం, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి పునరావాసం కల్పించేందుకు సహకరించడం, తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చడం వంటి కార్యక్రమాల్లో ఈ బృందం పాలుపంచుకుంటోంది. తల్లీకూతుళ్లకు సకాలంలో ఆశ్రయం కల్పించిన మహిళా పోలీసుల సేవలను పలువురు అభినందించారు.

