శక్తిపీఠంలో హుండీ చోరీ
హుండీ పగులగొట్టి వేలాది రూపాయల కానుకలు అపహరణ ఘటనా స్థలంలోనే సుత్తులు, ఇతర పరికరాలు వదిలి పరారీ సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దొంగల కోసం పోలీసుల గాలింపు

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 23 : విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ ప్రాంగణంలోని హుండీని పగులగొట్టి వేలాది రూపాయల కానుకలను అపహరించారు. సీవీఆర్ ఫ్లైఓవర్‌కు తూర్పువైపు ఉన్న శక్తిపీఠంలో హుండీ పగిలి ఉండటాన్ని గుర్తించిన పూజారి, పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుణానంద స్వామికి సమాచారం అందించారు. ఆయన కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ కొండలరావు, క్రైమ్ ఎస్సై హరిప్రసాద్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హుండీని పగులగొట్టేందుకు ఉపయోగించిన సుత్తులు, ఉలి తదితర పరికరాలను దుండగులు అక్కడే వదిలి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ తాళాలు పగులగొట్టకుండానే దొంగలు లోపలికి ఎలా ప్రవేశించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. శక్తిపీఠం ట్రస్ట్ కార్యదర్శి ఎస్.జ్ఞానేశ్వర్ ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

