తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తెలుగుదేశం భరోసా
చెరో రూ.2 లక్షలతో స్థిర నిక్షేపం... చిన్నారులకు పత్రాలు అందించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, సెప్టెంబర్ 28: గుడివాడ 14వ వార్డుకు చెందిన తెలుగుదేశం కార్యకర్త దాసరి దేవా, ఆయన భార్య అనారోగ్య సమస్యలతో మృతి చెందడంతో అనాథలైన ఇద్దరు చిన్నారులకు పార్టీ అండగా నిలిచింది. వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించింది. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చిన్నారుల పేర్లపై చెరో రూ.2 లక్షల చొప్పున స్థిర నిక్షేపం చేశారు. వాటికి సంబంధించిన పత్రాలను సోమవారం గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ బాధ్యుడు బూరగడ్డ శ్రీకాంత్తో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ దాసరి దేవా దంపతుల మృతి బాధాకరమన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావించినట్లు తెలిపారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తల కుటుంబాలకు ఆపద సమయంలో పార్టీ అండగా

ఉంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం సభ్యత్వం కలిగిన కార్యకర్తలు మృతి చెందితే రూ.5 లక్షల వరకు సభ్యత్వ బీమా సదుపాయం ఉంటుందని తెలిపారు. దేవా మృతికి బీమా వర్తించకపోవడంతో విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూ.4 లక్షల సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. చిన్నారుల చదువు, భవిష్యత్తుకు ఉపయోగపడేలా స్థిర నిక్షేపం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థిక సహాయం అందించడమే కాకుండా పార్టీ తోడుగా ఉందనే భరోసా కల్పించడం ముఖ్యమన్నారు. ఎమ్మెల్యే చొరవతో సహాయం అందడంపై చిన్నారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గుడివాడ తెలుగుదేశం అధ్యక్షుడు పండ్రాజు సాంబయ్య, నాయకులు లింగం ప్రసాద్, రామిదేని వేణుబాబు, ముల్లపూడి రమేష్ చౌదరి, మానూరి శ్రీను, ఉప్పటాల జమలయ్య, లంకలపల్లి దుర్గారావు, దాసరి సత్యనారాయణ, దాసరి జాన్, గనుగుల భరత్ తదితరులు పాల్గొన్నారు.

