తుఫాను వేళ రోడ్లపైకి ఎస్పీ.. సహాయక చర్యలపై ప్రత్యేక నిఘా!
ఏలూరు జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్... రహదారులపై నేలకొరిగిన చెట్ల తొలగింపునకు తక్షణ చర్యలు... ప్రజల ప్రాణరక్షణే లక్ష్యం.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు...

ఏలూరు, అక్టోబర్ 28 : ఆర్నబ్ తుఫాను ప్రభావంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. తుఫాను ధాటికి రహదారులపై నేలకొరిగిన చెట్లను తక్షణమే తొలగించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బుల్డోజర్లు, క్రేన్లను వినియోగించి రహదారులను క్లియర్ చేయాలని, ఇందుకోసం సంబంధిత శాఖలతో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగకుండా క్షేత్రస్థాయి అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న సమయంలో వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. నేలకొరిగిన చెట్లు, తెగిపడిన విద్యుత్ తీగలు, ప్రమాదకర హోర్డింగ్‌లకు దూరంగా ఉండాలన్నారు. వాహనదారులు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం కీలకం రెవెన్యూ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఎస్పీ ఆదేశించారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసు సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా వాతావరణ శాఖ, జిల్లా యంత్రాంగం జారీ చేసే అధికారిక హెచ్చరికలను పాటించాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ విజ్ఞప్తి చేశారు.

