తుఫాన్ ముప్పు.. కొండ ప్రాంతాల్లో పోలీసుల అప్రమత్తం!
ప్రమాదకర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు... సీఐ కొండలరావు పర్యవేక్షణలో రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు... పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు పోలీసుల సూచనలు...

విజయవాడ, అక్టోబర్ 28 : 'ఆర్నబ్' తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ కొత్తపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా ముందస్తు చర్యలు చేపట్టారు. కొత్తపేట సీఐ కొండలరావు ప్రత్యేక పర్యవేక్షణలో నలుగురు ఎస్సైలు, పోలీసు సిబ్బందితో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ప్రారంభించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. కొండవాలు ప్రాంతాలు, ప్రమాదకర ప్రదేశాల్లో నివసిస్తున్న ప్రజలను కలిసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేలా అవగాహన కల్పిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ కొండలరావు మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకు మించినది ఏదీ లేదని, తుఫాన్ సమయంలో ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలు పోలీసుల సూచనలు పాటించి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొండ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాలుగు పోలీసు బృందాలు ప్రజలకు సహాయక చర్యలు అందిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను సంప్రదించాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

