ఏఐ నిఘాలో ఇంద్రకీలాద్రి!
దసరా ఉత్సవాల్లో భక్తుల భద్రతకు సాంకేతిక కవచం.. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ.. కృత్రిమ మేధను విస్తృతంగా వినియోగిస్తున్నాం: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...

విజయవాడ, అక్టోబర్ 14: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంతో రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు. బుధవారం కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో సంప్రదాయ పోలీసు బందోబస్తుతోపాటు ఆధునిక సాంకేతిక వ్యవస్థలను వినియోగిస్తున్నామన్నారు. ఏఐ ఆధారిత రద్దీ విశ్లేషణ ద్వారా భక్తుల రాకపోకలను అంచనా వేస్తూ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. డ్రోన్లు, కెమెరాలతో నిఘా ఇంద్రకీలాద్రి, ఘాట్‌రోడ్డు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. డ్రోన్ల ద్వారా అందుతున్న దృశ్యాలను కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. వాహనాల నియంత్రణకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు కెమెరాలు, బూమ్ బ్యారియర్లను వినియోగిస్తున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా సమన్వయం భక్తుల రద్దీ, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రం కీలకంగా పనిచేస్తోందన్నారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. భక్తులు పోలీసుల సూచనలు పాటించాలని, క్యూలైన్లలో క్రమశిక్షణతో ముందుకు సాగాలని కోరారు. పిల్లలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని డీజీపీ స్పష్టం చేశారు. ఆయన వెంట దేవస్థానం ఈవో వీకే శీనా నాయక్, నగర పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఉన్నారు.

