దసరాకు ‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్లు విడుదల
రూ.వెయ్యితో సామాన్య భక్తులకు ప్రత్యేక దర్శనం… మన మిత్ర వాట్సాప్‌లో 11, 12, 13 తేదీల టికెట్లు అందుబాటులో… మధ్యవర్తుల అవసరం లేకుండానే బంగారు వాకిలి నుంచి అమ్మవారి దర్శనం…

విజయవాడ, అక్టోబర్ 9: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సామాన్య భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘జగన్మాత దివ్య దర్శన్’ టికెట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ శుక్రవారం విడుదల చేశారు. ఎలాంటి సిఫార్సులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా భక్తులు అమ్మవారిని సమీపంగా దర్శించుకునేలా ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. ఉత్సవాల తొలి మూడు రోజులైన అక్టోబర్ 11, 12, 13 తేదీలకు సంబంధించిన టికెట్లను రాష్ట్ర ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ సేవల ద్వారా అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఒక్కో టికెట్ధర రూ.వెయ్యిగా నిర్ణయించినట్లు తెలిపారు. భక్తులు 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. టికెట్లు పొందిన భక్తులు కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీ స్థలం వద్దకు చేరుకోవాలని, అక్కడి నుంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా కొండపైకి తరలిస్తామని వివరించారు. ఓం టర్నింగ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్ ద్వారా భక్తులను ఆలయంలోకి అనుమతించి ముఖ మండపం (బంగారు వాకిలి) నుంచి కనకదుర్గమ్మ దర్శనం కల్పిస్తామన్నారు. దసరా ఉత్సవాల్లో రూ.500, రూ.300, రూ.100 దర్శన టికెట్లను రద్దు చేసి, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పిస్తున్నట్లుఈవో వివరించారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, తిరిగి రాత్రి 7.45 నుంచి 9.45 గంటల వరకు రూ.వెయ్యి టికెట్ దర్శనానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విధంగా నాలుగు గంటలు మాత్రమే ప్రత్యేక దర్శన సమయం ఉండగా, సామాన్య భక్తులకు ‘జగన్మాత దివ్య దర్శన్’ ద్వారా రోజుకు ఎనిమిది గంటలపాటు రూ.వెయ్యి టికెట్‌పై ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూలా నక్షత్రం రోజు మినహాయించి మిగిలిన రోజులకు సంబంధించిన టికెట్లను విడతలవారీగా విడుదల చేస్తామని వెల్లడించారు. భక్తులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా వాట్సాప్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవాలని, కేటాయించిన సమయానికి చేరుకుని అమ్మవారిని సౌకర్యవంతంగా దర్శించుకోవాలని ఈవో వి.కె. శీనా నాయక్ సూచించారు.
