సుందరయ్య నగర్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
తెలుగుజాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు ప్రతీక ఎన్టీఆర్... బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాంతం కృషి... ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే బొండా ఉమా...

విజయవాడ, సెప్టెంబర్ 29: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ సుందరయ్య నగర్ మసీదు సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం ఆయన ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజా రాజకీయాల్లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యతని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సుందరయ్య నగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ఆయన సేవలు, ఆశయాలను భావితరాలకు గుర్తుచేసేలా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, ఇన్‌ఛార్జి మోత్కూరి కాసిం, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
