విధుల్లోనే ఎస్సై వెంకన్న బలి
గణేశ్ నిమజ్జనం బందోబస్తులో గుర్తుతెలియని వాహనం ఢీ చికిత్స పొందుతూ మృతిచెందిన కొత్తగూడెం ఎస్సై కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రప్రభ): హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం బందోబస్తు విధుల్లో ఉన్న కొత్తగూడెం రెండో పట్టణ పోలీస్స్టేషన్ ఎస్సై కె.వెంకన్నను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఎస్సై వెంకన్న మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ఆయన ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమన్నారు. వెంకన్న మరణం ఆయన కుటుంబానికే కాకుండా మొత్తం పోలీసుశాఖకు తీరని లోటని పేర్కొన్నారు. వెంకన్న కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, బాధ్యుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

