జాతీయ భావంతోనే దేశం మరింత బలపడుతుంది: ఏసీపీ దైవప్రసాద్
ఏసుక్రీస్తు చూపిన ప్రేమ, క్షమాగుణం ప్రతి ఒక్కరిలో ఉండాలి... కులమతాలకు అతీతంగా ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించాలి... పేదలకు, సమాజానికి సేవ చేయడంలో ఎప్పుడూ ముందుంటా: దైవప్రసాద్...



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఆగస్టు 15 — V10TV AP: కులాలు, మతాలు వేరైనా దేశం విషయంలో ప్రతి ఒక్కరిలో జాతీయ భావం ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ టి. దైవప్రసాద్ పిలుపునిచ్చారు. విజయవాడ వించిపేటలోని ఆగపే ఫుల్ గాస్పల్ చర్చిలో పాస్టర్ ఎం. దయాసాగర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏసీపీ దైవప్రసాద్ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు చూపిన ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉండాలని, కోపం, ద్వేషం, స్వార్థానికి మనసులో చోటివ్వకూడదని సూచించారు. తనను సిలువపై హింసించిన వారిని సైతం ఏసుక్రీస్తు క్షమించారని, అదే స్ఫూర్తితో ఇతరులను క్షమించే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు. కష్టాల్లో ఉన్న వారికి మనవంతు సహాయం అందించడమే నిజమైన మానవత్వమని పేర్కొన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలబాలికలు ప్రదర్శించిన దేశభక్తి స్కిట్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. స్కిట్ చిన్నదైనా అందులో గొప్ప సందేశం ఉందని ప్రశంసించారు. ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు.


చిన్న సంఘం నిర్వహించిన జెండా వందన కార్యక్రమం ద్వారా దేశానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు. కులాలు, మతాలు వేరైనా దేశం కోసం అందరం ఒక్కటేనన్న భావన బలపడాలని చెప్పారు. క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు.
పేదలు, అవసరాల్లో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్న దైవప్రసాద్, సమాజ సేవలో తనవంతుగా ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. ప్రేమ, క్షమ, సేవాభావంతో పాటు దేశభక్తిని పెంపొందించుకున్నప్పుడే సమాజం, దేశం మరింత బలపడతాయని పేర్కొన్నారు.

