పులస కాదు.. పిత! పుస్తెలతాడు తాకట్టు పెట్టి జాతిపితకు గౌరవం
భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి గాంధీ విగ్రహానికి పునరుద్ధరణ... సొంతంగా రూ.1.10 లక్షలు ఖర్చు చేసిన ఏటూరు వాసి తుమాటి వీరభద్రరావు... ఓ వార్తకు స్పందన.. జాతిపితపై అభిమానంతో ఆదర్శంగా నిలిచిన సామాన్యుడు..

నందిగామ, ఆగస్టు 15 — V10TV: “పుస్తెలతాడు తాకట్టు పెట్టైనా పులస తినాలి” అనే సామెత అందరికీ తెలిసిందే. కానీ నందిగామ మండలం ఏటూరు గ్రామంలో మాత్రం ‘పులస కాదు.. పిత!’ అన్నట్లుగా ఓ సామాన్యుడు చేసిన పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
ఏటూరు గ్రామంలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం దుస్థితిపై ‘ది డెస్క్’ పత్రికలో వారం క్రితం ప్రచురితమైన వార్తకు గ్రామానికి చెందిన తుమాటి వీరభద్రరావు స్పందించారు. విగ్రహం పరిస్థితిని చూసి చలించిన ఆయన ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా తన భార్య పుస్తెలతాడును తాకట్టు పెట్టి మరీ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు.
విగ్రహం పరిసరాలను శుభ్రం చేయించడంతో పాటు రంగులు వేయించారు. సిమెంట్ దిమ్మలు నిర్మించి, ఇనుప రైలింగ్, మెట్లు ఏర్పాటు చేయించారు. జాతిపిత విగ్రహానికి సముచిత గౌరవం కల్పించాలన్న సంకల్పంతో సుమారు రూ.1.10 లక్షలు సొంతంగా ఖర్చు చేశారు.
సామాన్యుడి గుండెల్లో గాంధీ
స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి గౌరవం దక్కాలనే ఉద్దేశంతో వీరభద్రరావు చేసిన ప్రయత్నం పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. పుస్తెలతాడును తాకట్టు పెట్టి మరీ జాతిపిత విగ్రహాన్ని తీర్చిదిద్దడం ఆయనలోని దేశభక్తికి నిదర్శనంగా నిలిచింది.
ఒక వార్తతో మొదలైన స్పందన.. చివరకు జాతిపితకు ఘన నివాళిగా మారింది. విగ్రహానికి వేసినవి రంగులే కావచ్చు.. కానీ దానికి కొత్త కళ తెచ్చింది మాత్రం ఓ సామాన్యుడి గుండెల్లోని గాంధీపై అభిమానం.

