కనకదుర్గమ్మకు ప్రసాదాల విభాగం సారె
ప్రసాదాల తయారీ విభాగం అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో సమర్పణ... మంగళవాయిద్యాల నడుమ చీర, గాజులు, పసుపు-కుంకుమలతో ప్రత్యేక పూజలు... కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్...

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ప్రసాదాల తయారీ విభాగం అధికారులు, సిబ్బంది భక్తిశ్రద్ధలతో ఆషాఢ సారె సమర్పించారు.
సంప్రదాయబద్ధంగా మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి చీర, సారె, గాజులు, పసుపు-కుంకుమ తదితర మంగళ ద్రవ్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ప్రసాదాల తయారీ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ సునీత పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో క్లర్కులు, వంట మాస్టర్లు, కాంట్రాక్టర్లు, కార్మికులు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో నిత్యం పనిచేస్తున్న సిబ్బంది సమిష్టిగా ఆషాఢ సారె సమర్పించడం అభినందనీయమని ఆలయ చైర్మన్, ఈవో పేర్కొన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు సిబ్బంది, వారి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం సిబ్బందికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

