వెల్లంపల్లిపై విమర్శలు చేస్తే ఖబడ్దార్!
పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?.. వైసీపీ నేతల సవాల్... వైసీపీ హయాంలో చేసిన పనులనే కూటమి ప్రభుత్వం తమ అభివృద్ధిగా చెప్పుకుంటోందని విమర్శ... మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్...

విజయవాడ పశ్చిమ: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ బాజీ బాబా అన్నారు. వెల్లంపల్లిపై ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
రాయల్ హోటల్ సమీపంలోని ఖాన్ దర్బార్ సోల్జర్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాజీ బాబా మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి వెల్లంపల్లి శ్రీనివాస్ చిరునామాగా నిలిచారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ఆధారాలతో చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
టీడీపీ కార్యాలయం ఉన్న గణపతిరావు రోడ్డును సైతం వెల్లంపల్లి హయాంలోనే అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులేమిటో చెప్పాలని ప్రశ్నించారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.
టీడీపీని ‘వెన్నుపోటు పార్టీ’గా బాజీ బాబా విమర్శించారు. గతంలో కేశినేని నానికి ఎదురైన పరిస్థితులే భవిష్యత్తులో కేశినేని చిన్నికి ఎదురయ్యే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు.
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ హయాత్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ వ్యవహారంపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
53వ డివిజన్ అధ్యక్షుడు గురుమంత్ర మహేష్ మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.

