రూ.29 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
15వ డివిజన్‌లో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన… చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే గద్దె… మరో 15 ఏళ్లు కూటమిదే అధికారమని ధీమా…

విజయవాడ, అక్టోబర్ 12: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వానికి బీజేపీ సహకారం తోడవడంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి అధికారంలో కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్‌లో రూ.29 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రుద్రభూమి రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రహదారులతోపాటు భూగర్భ డ్రైనేజీ పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రాజెక్టులను చేపడతారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం ఇందుకు నిదర్శనమన్నారు. అమరావతి రాజధాని కోసం రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని సమీకరించారని గుర్తుచేశారు. విజయవాడలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల అంతర్జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలు నగరంలో పనులు చేపట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రామలింగేశ్వరనగర్‌లో రహదారులు, భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయితే ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపడతాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉండేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంతోపాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సింగంశెట్టి రమేష్, గాదిరెడ్డి అమ్ములు, ముమ్మనేని ప్రసాద్, కట్టెంపూడి శేషుబాబు, ఈశ్వరరావు, ఉమ్మడిశెట్టి బహుదూర్, నందమూరి పూర్ణచంద్రరావు, గద్దె రమేష్, సట్టు శ్రీను, కార్పొరేషన్ ఈఈ రామారావు తదితరులు పాల్గొన్నారు.

