పేదల సొంతింటి కలకు ఆర్థిక చేయూత
రాజీవ్‌నగర్‌లో 50 మందికి గృహ నిర్మాణ మంజూరు పత్రాల అందజేత… ఒక్కో కుటుంబానికి రూ.2.50 లక్షలు.. మొత్తం రూ.1.25 కోట్ల సహాయం… సెంట్రల్‌లో సుమారు వెయ్యి కుటుంబాలకు లబ్ధి: ఎమ్మెల్యే బొండా ఉమా…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 7: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తోందని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం 63వ డివిజన్ రాజీవ్‌నగర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీప మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో 50 మంది లబ్ధిదారులకు గృహ నిర్మాణ సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాలను అందజేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–2.0లోని బీఎల్‌సీ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల చొప్పున మొత్తం రూ.1.25 కోట్ల సహాయం మంజూరైనట్లు తెలిపారు. సొంత స్థలం ఉన్న అర్హులైన పేద కుటుంబాలకు గృహ నిర్మాణంలో ఈ సహాయం ఉపయోగపడుతుందని బొండా ఉమా చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2.50 లక్షల చొప్పున గృహ నిర్మాణ సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌లో కార్యక్రమాలు నిర్వహించి అర్హులకు మంజూరు పత్రాలను అందజేస్తున్నామన్నారు. తాను ఎమ్మెల్యేగా

ఉన్న 2014–2019 మధ్య రాజీవ్‌నగర్‌లో రహదారుల అభివృద్ధితోపాటు బీఎల్‌సీ పథకం ద్వారా పలువురు పేదలకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణానికి సహాయం అందక, ఇసుక కొరతతో పేదలు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న అర్హులైన పేదలకు జీవో నంబరు 30 ద్వారా శాశ్వత హక్కులు కల్పించే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. ఇటీవల విజయవాడలో వేలాది మందికి ఇళ్ల పట్టాలు అందజేశామన్నారు. పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు లబ్బా వైకుంఠరావు, లబ్బా దుర్గ, డివిజన్ ఇన్‌చార్జి మోతుకూరి కాసిం, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, పెద్ది శ్రీను, మోదుగుల గణేష్, చిగుళ్ల నాగమణి, బైరి శీను, బత్తుల కొండ, షేక్ మెహర్, బాజీ తదితరులు పాల్గొన్నారు.

